: దహన సంస్కారాలు చేసేందుకు ససేమిరా అన్న కుమారులు.. కూతుళ్లే అంత్యక్రియలు నిర్వ‌హించిన వైనం

'కంటే కూతురినే క‌నాలి' అనేలా త‌ల్లిదండ్రుల‌పై కూతుళ్లు ఔదార్యం క‌న‌బ‌రుస్తున్నారు. కుమారులు త‌ల్లిదండ్రుల బాగోగులు ప‌ట్టించుకోకున్నా కూతుళ్లే వారి త‌ల్లిదండ్రుల‌కి త‌ల్లిలా మారి వారి ఆల‌నాపాల‌నా చూసుకుంటున్నారు. త‌ల్లిదండ్రుల‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌బోమంటూ కుమారులు కాఠిన్యం క‌న‌బ‌రుస్తోంటే కూతుళ్లే వారికి ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హిస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌నే సిరిసిల్ల మండలం రామన్నపల్లెలో మ‌రొక‌టి చోటుచేసుకుంది. లస్మవ్వ- ఎల్లయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, న‌లుగురు కూతుళ్లు. ఎల్లయ్య 20 ఏళ్ల క్రిత‌మే చ‌నిపోయాడు. తండ్రి సంపాదించిన ఆస్తిని కుమారులు, కూతుళ్లు భాగాలుగా విడ‌గొట్టి తీసుకున్నారు. ఆ త‌రువాత‌ త‌ల్లి లస్మవ్వను పోషించ‌డానికి ముగ్గురు కుమారులు మల్లయ్య, ఎల్లయ్య, పర్శయ్య నిరాక‌రించారు. దీంతో ప‌దేళ్లుగా కూతుళ్లు ఎల్లవ్వ, లచ్చవ్వ, మల్లవ్వ, రాధవ్వ త‌మ త‌ల్లిని కంటికి రెప్ప‌లా చూసుకుంటున్నారు. త‌ల్లి లస్మవ్వ (90) అనారోగ్యంతో చ‌నిపోయింది. ఈ విష‌యాన్ని కొడుకుల‌ను చెప్పారు. అయితే కొడుకులు ఆ త‌ల్లికి అంతిమ సంస్కారాలు నిర్వ‌హించ‌డానికి నిరాక‌రించారు. దీంతో కూతుళ్లే త‌మ త‌ల్లికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. పెద్ద కూతురు ఎల్లవ్వ త‌న‌ తల్లికి తల కొరివి పెట్టింది. ఈ సంఘటన గ్రామ‌స్తుల్లో ఆగ్ర‌హం తెప్పించింది. కొడుకులపై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేస్తామ‌ని ఆ గ్రామ ఉపసర్పంచ్ మందాటి తిరుపతి, ఏఎంసీ డైరెక్టర్ ఆత్మకూరి రంగయ్య తెలిపారు.

More Telugu News