: అదృశ్యమైన 80 రోజుల తరువాత అస్థిపంజరాల రూపంలో కనిపించిన ప్రేమజంట!
రంజిత్ (28) ఎంబీఏ చదివి తండ్రికి చేదోడు వాదోడుగా వ్యవసాయ పనుల్లో సహకరిస్తున్న యువకుడు. సహన (20) బీటెక్ చదువుతున్న యువతి. ఇద్దరూ ఒకే ఊరి వాళ్లు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. పెద్దలు కాదనడంతో అదృశ్యమయ్యారు. రంజితే, తమ కుమార్తె సహనను కిడ్నాప్ చేశారని కేసు కూడా నమోదైంది. ఇది జరిగి రెండున్నర నెలలు దాటింది. తాజాగా వీరిద్దరి మృతదేహాలూ అస్థిపంజరాల రూపంలో కనిపించడం సంచలనం కలిగించింది.
వరంగల్ జిల్లా శాయంపేట సమీపంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పూర్వాపరాలపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కొత్తగట్టు సింగారం గ్రామంలో రంజిత్, విట్స్ ఇంనీరింగ్ కాలేజీ విద్యార్థిని సహన ప్రేమించుకున్నారు. వీరి విషయం తెలిసి పెద్దలు గొడవ చేయడంతో, రంజిత్ గతంలో ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. కుటుంబీకులు సకాలంలో స్పందించడంతో ప్రాణాలు మిగిలాయి.
ఆపై రెండు నెలల పాటు రంజిత్ ను ఊరికి దూరంగా పంపారు. తిరిగి సర్దుకున్నాడని భావించి, ఇంటికి తీసుకు వస్తే, తన ప్రేమను కొనసాగించాడు. రంజిత్ కు పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించడంతో, తన ప్రేమ విఫలమవుతుందని భావించి ఏప్రిల్ 26న సహనను తీసుకుని వెళ్లిపోయాడు. ఆపై సహన తల్లిదండ్రులు ప్రభాకర్, వనమ్మలు రంజిత్ పై ఫిర్యాదు చేయగా, అతని బైక్ పులుకుర్తి గుట్టల్లో కనిపించింది. అక్కడెవరూ లేకపోవడంతో, బండిని వదిలేసి వారు పారిపోయి ఉంటారని భావించారు. అతని సెల్ ఫోన్ సైతం అప్పటి నుంచి పనిచేయక పోవడంతో, ఈ జంట ఆచూకీ తెలియలేదు.
ఈ క్రమంలో నిన్న పులుకుర్తి గుట్టల పరిసరాల్లో గొర్రెలను కాసుకునేందుకు వెళ్లిన వ్యక్తికి రెండు అస్థిపంజరాలు కనిపించాయి. పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి పరిశీలిస్తే, ఈ మృతదేహాలు రంజిత్, సహనలవేనని తేలింది. ఆ పక్కనే వీరు తాగి పడేసిన పురుగుల మందు డబ్బా కూడా వుంది. దీంతో వీరు ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించి, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో, వారు కన్నీరు మున్నీరయ్యారు.