: ఇప్పట్లో భారీ వర్షాలకు ఛాన్స్ లేదంటున్న వాతావరణ శాఖ!
తెలుగు రాష్ట్రాల్లో సమీప భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడం లేదని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు బలహీన పడటంతో, అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలకు మాత్రమే ఛాన్సుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి వివరించారు. ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని, దీని ఫలితంగా ఉరుములు, గాలులతో కూడిన జల్లులు కురుస్తాయని అన్నారు.
నెలాఖరు తరువాతే రుతుపవనాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు. సెప్టెంబరులో విస్తారంగా వర్షాలు కురవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా 2 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పంజాబ్ నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకూ రుతుపవన ద్రోణి కదలికలతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే 48 గంటల్లో స్వల్ప వర్షపాతం నమోదు కావచ్చని అంచనా.