: నాదైన రోజున ఎవరైనా బలాదూర్: సైనా నెహ్వాల్
తాను ఫిట్ గా ఉండి రాణించిన రోజున బ్యాడ్మింటన్ క్రీడలో ఎవరినైనా సరే ఓడించగలనని భారత స్టార్ సైనా నెహ్వాల్ చెబుతోంది. వచ్చే నెలలో రియోలో జరగనున్న ఒలింపిక్స్ లో ప్రత్యర్థులపై ఆధిపత్యం చూపేందుకు తాను కఠోర శిక్షణ తీసుకుంటున్నానని 26 ఏళ్ల సైనా వెల్లడించింది. నాలుగేళ్ల నాడు లండన్ లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సైనా, తానీదఫా స్వర్ణంపై కన్నేశానని అంటోంది. వరల్డ్ నంబర్ 5 స్థానంలో ఉన్న తాను శక్తి మేరకు ఆడి, కాస్తంత అదృష్టం కలిసొస్తే పతకం కచ్చితంగా తేగలనని నమ్మకంగా చెప్పింది. "అడపాదడపా ఏడిపించే గాయాలు మాని, నాకు నేను ఫిట్ గా ఉన్నానని భావించిన వేళ, ప్రత్యర్థి ఎవరైనా సరే, విజయంతోనే తిరిగి వస్తాను" అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. శారీరక బలంతో పాటే మానసిక బలం కూడా ముఖ్యమేనని సైనా పేర్కొంది.