: ఇన్ఫోసిస్ దెబ్బతో ఐటి కంపెనీల షేర్లు కుదేలు!
ఈ ఉదయం ఇన్ఫోసిస్ ప్రకటించిన ఫలితాలు, ఆ సంస్థ ఈక్విటీని భారీగా పతనం చేయగా, మొత్తం ఐటీ ఇండెక్స్ కుప్పకూలింది. మార్చి త్రైమాసికంతో పోలిస్తే జూన్ త్రైమాసికంలో 4.5 శాతం మేరకు నికర లాభం తగ్గడం, ఆపై ఆదాయ వృద్ధి అంచనాలు తగ్గడంతో ఇన్ఫోసిస్ ఈక్విటీ విలువ మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో 8.16 శాతం దిగజారి రూ. 1079కి చేరింది. ఈ ప్రభావం మిగతా సంస్థలపైనా పడింది. ఇన్ఫోసిస్ పరిస్థితే ఇలా ఉంటే, మిగతా ఐటి కంపెనీల ఆదాయం సైతం తగ్గుతుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. ఎంఫసిస్ ఈక్విటీ విలువ 3.93 శాతం, విప్రో 2.79 శాతం, టెక్ మహీంద్రా 2.77 శాతం, టీసీఎస్ 2.69 శాతం, జస్ట్ డయల్ 2 శాతం మేరకు పతనమయ్యయి. మిగతా లిస్టెడ్ ఐటీ కంపెనీల్లో ఆర్ కాం, ఫిన్ కేబుల్స్, టీవీ 18, హెచ్సీఎల్ టెక్, హెచ్ఎఫ్సీఎల్, ఎంటీఎన్ఎల్, టాటా ఇలెక్సిస్, మైండ్ ట్రీ, పర్సిస్టెంట్ తదితర కంపెనీలు 1 నుంచి రెండు శాతం నష్టపోయాయి.