: అమెరికా, భారత్ లు కలిసి చేపట్టిన 'ప్రాజెక్ట్ ఎక్స్'... విశేషాలివి!


భవిష్యత్ తరాలకు మరింత మెరుగైన ఇంధన వనరులను అందించాలన్న ఉద్దేశంతో 'ప్రాజెక్ట్ ఎక్స్' పేరిట ఇండియా, అమెరికాలు సంయుక్తంగా ఎనర్జీ జనరేటింగ్ సిస్టమ్ ను తయారు చేస్తున్నాయి. కర్బన రహిత హరిత విద్యుత్ ను తయారు చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇప్పుడున్న సంప్రదాయ అణు విద్యుత్ ప్లాంట్లతో పోలిస్తే పర్యావరణానికి మరింత స్నేహపూర్వకంగా ఉంటూ, నాణ్యమైన విద్యుత్ ను అందించేలా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో ఇరు దేశాల సైంటిస్టులు, విద్యార్థులు భాగమయ్యారు. యూఎస్ లోని ప్రతిష్ఠాత్మక ఫెర్మీ ల్యాబ్, ఇండియాలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లు 'ప్రాజెక్ట్ ఎక్స్'ను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఒక బిలియన్ డాలర్లు (సుమారు రూ. 6,700 కోట్లు) వ్యయమవుతుందన్న అంచనాలుండగా, ఉపకరణాలు 2023 నాటికి సిద్ధమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలోనే లైన్ పార్టికల్ యాక్సిలేటర్లను (కాంతి వేగంతో ప్రాథమిక కణాలను గింగిరాలు తిప్పుతూ నియంత్రిత మార్గంలో పంపుతూ శక్తిని పుట్టించడం) నిర్వహణలో అత్యుత్తమ సంస్థగా ఉన్న ఫెర్మీల్యాబ్, ఈ ప్రాజెక్టు కోసం ఏడీఎస్ (యాక్సిలేటర్ డ్రివెన్ సిస్టమ్స్) ను రియాక్టర్లలో వాడుతోంది. జపాన్ లోని ఫుకుషిమా, రష్యాలోని చర్నోబిల్ లలో జరిగినటువంటి అణు ప్రమాదాలు ఈ విధానంలో ఉండవని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. "ఒకసారి యాక్సిలేటర్ ను నిలిపితే, మిగతా అన్ని వ్యవస్థలూ ఆగిపోతాయి. ఈ విధానం చాలా సురక్షితం" అని ఫెర్మీల్యాబ్ డైరెక్టర్ నిగెల్ లాక్ యార్ వెల్లడించారు. కాగా, ఈ వ్యవస్థ తయారు అత్యంత క్లిష్టమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకూ విద్యుత్ తయారీకి ఏడీఎస్ వ్యవస్థను ఏ దేశమూ తయారు చేయలేదు. ఎందుకంటే న్యూట్రానుల కిరణాలను నియంత్రణలో ఉంచడం అంత సులభం కాదు కాబట్టి. వాటి నియంత్రణకు ఈ 'ప్రాజెక్ట్ ఎక్స్' కోసం భారీ స్థాయిలో అయస్కాంతాలను తయారుచేసి, క్షేత్ర పరిరక్షణ వ్యవస్థను రూపొందించాల్సి వుంటుందని నిగెల్ తెలిపారు. వీటిలోని ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవడం క్లిష్టమని, ప్రాజెక్టుకు అవసరమైన ప్రతి పరికరాన్ని, విడి భాగాన్నీ కొత్తగా తయారు చేయాల్సి వుందని తెలిపారు. తొలి దశలో రెండు మెషీన్లు సేవలందిస్తాయని, మొట్టమొదటి ఏడీఎస్ రియాక్టర్, బీఏఆర్సీ విశాఖపట్నంలో ప్రతిపాదించిన కొత్త క్యాంపస్ లో ఉంటుందని తెలుస్తోంది. మరో మెషీన్ చికాగోలో ఉంటుందని తెలుస్తోంది. మానవాళికి ఈ తరహా ప్రాజెక్టు అత్యంత ఆవశ్యకమని భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్ అనిల్ కొకోద్కర్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News