: ముగిసిన ఎన్ఐఏ కస్టడీ!... నేడు నాంపల్లి కోర్టుకు ‘హైదరాబాదీ’ ఉగ్రవాదులు!
భాగ్యనగరి హైదరాబాదు సహా పలు ప్రాంతాల్లో పెను విధ్వంసానికి పథక రచన చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఐదుగురు ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులకు కోర్టు విధించిన పోలీసు కస్టడీ నిన్నటికే ముగిసింది. ఈ క్రమంలో నేటి ఉదయం ఐదుగురు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టు అనుమతితో ఐదుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ 12 రోజుల పాటు విచారించింది.
హైదరాబాదులోని ఎన్ఐఏ కార్యాలయంలోనే కొనసాగిన ఈ విచారణలో ఆ సంస్థ అధికారులు ఉగ్రవాదుల నుంచి పలు కీలక విషయాలను రాబట్టారు. ఏపీలోని అనంతపురం జిల్లాతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు కూడా ఉగ్రవాదులను తీసుకెళ్లి ఎన్ఐఏ విచారించిన సంగతి తెలిసిందే. కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఉగ్రవాదులను నేడు కోర్టులో హాజరుపరచనున్న ఎన్ఐఏ... విచారణలో వెల్లడైన పలు అంశాలను ప్రస్తావిస్తూ త్వరలోనే చార్జిషీటు దాఖలు చేయనున్నట్లు సమాచారం.