: భారీ లాభాల్లో మార్కెట్లు... 500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్!
అమెరికాలో నిరుద్యోగ గణాంకాల డేటా మద్దతు ఇవ్వడం, అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ల లాభాలు నూతన కొనుగోళ్లకు సహకరించగా, భారత మార్కెట్ భారీ లాభాల్లో నిలిచింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, దేశవాళీ ఫండ్ సంస్థలు ఉత్సాహంగా కొనుగోళ్లకు తెరలేపాయి. జూన్ నెల ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గిందన్న వార్తలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచాయి. దీంతో అన్ని సెక్టార్లూ లాభాల్లో నడిచాయి. సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 499.79 పాయింట్లు పెరిగి 1.84 శాతం లాభంతో 27,626.69 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 144.70 పాయింట్లు పెరిగి 1.74 శాతం లాభంతో 8,467.90 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 1.49 శాతం, స్మాల్ కాప్ 0.79 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 48 కంపెనీలు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,944 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,721 కంపెనీలు లాభాలను, 1,039 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. గత వారాంతంలో రూ. 1,04,05,759 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, రూ. 1,05,37,709 కోట్లకు పెరిగింది.