: భారత్ కు నేడు జకీర్ నాయక్!... నోటీసులతో సిద్ధంగా ఉన్న ముంబై పోలీసులు, ఎన్ఐఏ!
ఇస్లామిక్ వివాదాస్పద మత గురువు జకీర్ నాయక్ నేడు భారత్ కు వస్తున్నారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న ఆయన నేడు ముంబై చేరుకోనున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రవాద దాడిలో పాలుపంచుకున్న ఉగ్రవాదుల్లో ఇద్దరు ముష్కరులు తాము జకీర్ నాయక్ ప్రసంగాలతోనే ఉత్తేజితులమయ్యామని చెప్పడంతో జకీర్ నాయక్ పై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.
‘పీస్ టీవీ’ ద్వారా జకీర్ నాయక్ చేస్తున్న ప్రసంగాలపై ఇప్పటికే ఇటు ముంబై పోలీసులతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేపట్టాయి. నేడు ముంబై రానున్న జకీర్... రేపు మీడియాతో నేరుగా మాట్లాడే అవకాశాలున్నాయి. తనపై వెల్లువెత్తుతున్న విమర్శలకు సమాధానం చెప్పేందుకే ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారన్న వాదన వినిపిస్తోంది. అయితే ఇప్పటికే ఆయనపై దర్యాప్తు ప్రారంభించిన ముంబై పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.