: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో జాత్యహంకార వ్యాఖ్యల కలకలం.. సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసిన మణిపూర్ యువతి
జాత్యహంకార వ్యాఖ్యల ఆరోపణలు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేపుతున్నాయి. సియోల్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన తనను ఇమ్మిగ్రేషన్ అధికారి ఒకరు ‘నీది ఇండియా కానట్టు కనిపిస్తోంది?’ అని వ్యాఖ్యానించినట్టు ఓ యువతి సోషల్ మీడియాలో పేర్కొంది. అధికారితో జరిగిన సంభాషణను ఫేస్బుక్లో పోస్టు చేసింది. మణిపూర్‌కు చెందిన మోనిక ఖంగెంబమ్ సియోల్ వెళ్లేందుకు శనివారం రాత్రి విమానాశ్రయానికి వచ్చారు.
ఆమె పాస్‌పోర్టును తనిఖీ చేసిన ఇమ్మిగ్రేషన్ అధికారి ‘‘ఇండియన్ తో నహీ లగ్తీ హో’’(చూస్తుంటే ఇండియన్లా కనిపించడం లేదు) అని వ్యాఖ్యనించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించని ఆమె వెళ్లిపోయింది. జాత్యహంకార వ్యాఖ్యలపై మోనిక పోలీసులకు కానీ, విమానాశ్రయ అధికారులకు కానీ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. కొందరు అధికారుల ద్వారా తమకీ విషయం తెలిసినట్టు చెప్పారు.
మొదట ఇండియన్లా కనిపించడం లేదన్న అధికారి ఆ తర్వాత ముఖంపై నవ్వు పులుముకుని ‘పక్కా ఇండియన్’ అని వ్యాఖ్యనించినట్టు మోనిక తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలకు తాను స్పందించలేదని తెలిపారు. ఇప్పటికే తనకు ఆలస్యమైందని చెబుతున్నా ‘‘చెప్పు చెప్పు.. నీది ఏ ప్రాంతం?’’ అని ఇబ్బంది పెట్టినట్టు ఆవేదన వ్యక్తం చేశారు.