: యూపీ ఎన్నికల్లో రాహుల్, ప్రియాంక ప్రచారం.. వచ్చే నెల నుంచే ప్రారంభం

ఉత్తరప్రదేశ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ వచ్చే నెల నుంచి ఆ రాష్ట్రంలో ప్రచార భేరీ మోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, అతని సోదరి ప్రియాంకతో కలిసి యూపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తోంది. లక్నోలో వచ్చే నెల పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న రాహుల్ ఎన్నికల ప్రచారానికి తెరతీయనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్యనేతలంతా సమావేశమై ఎన్నికల ప్రచారానికి ఓ రూపు ఇవ్వనున్నట్టు సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. అలాగే యూపీ ఎన్నికల్లో ప్రియాంక పాత్రపైనా చర్చించనున్నట్టు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రియాంక గాంధీకి బాధ్యతలు అప్పజెప్పాలని చాలా కాలంగా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రియాంక తన తల్లి సోనియా, సోదరుడు రాహుల్ పోటీ చేసిన రాయబరేలీ, అమేథీ లలో మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆగస్టు 12న లక్నోలో ప్రచారం ప్రారంభించనున్న కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోదీ నియోజకవర్గమైన వారణాసిలో ప్రచారం చేయనుంది. కాగా 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ యూపీలో 355 స్థానాలకు గాను 28 సీట్లు మాత్రమే గెలుచుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News