: అస‌దుద్దీన్ ఒవైసీపై చ‌ర్య‌లు తీసుకోండి.. రాజ్‌నాథ్ సింగ్‌కు బీజేపీ తెలంగాణ నేత‌ల ఫిర్యాదు

ఎంఐఎం అధినేత‌, పార్ల‌మెంట్ స‌భ్యుడు అస‌దుద్దీన్ ఒవైసీ ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ప‌ట్టుబ‌డిన ఉగ్ర‌వాదుల‌కు న్యాయ స‌హాయం అందిస్తాన‌ని చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ బీజేపీ నేత‌లు ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత‌లు కిషన్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, బద్దం బాల్‌రెడ్డి కేంద్ర హోం మంత్రితో అస‌దుద్దీన్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ అంశంపై రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణ రాష్ట్ర‌ గవర్నర్‌ నుంచి నివేదిక తెప్పించుకుంటామ‌ని, అనంత‌రం చర్యలు తీసుకుంటామని చెప్పార‌ని కిషన్‌రెడ్డి మీడియాకి తెలిపారు. అస‌దుద్దీన్ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌జ‌లు కూడా మండిప‌డుతున్నార‌ని ఈ సంద‌ర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. దాడుల‌తో విరుచుకుప‌డే ఉగ్ర‌వాదులకు అస‌దుద్దీన్ న్యాయ‌స‌హాయం చేస్తాన‌న‌డ‌మేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఉగ్ర‌వాదుల‌కు స‌హ‌క‌రించే అస‌దుద్దీన్ చ‌ర్యలను ఉపేక్షించ‌రాద‌ని, ఆయ‌న‌ పార్ల‌మెంట్ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని కిష‌న్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం ప‌ట్ల ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఎంఐఎం వ్యవహారం హైదరాబాద్ పోలీసుల ఆత్మస్థైర్మాన్ని దెబ్బతీసేలా ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. హైద‌రాబాద్‌లో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు చెల‌రేగేలా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఎంఐఎంపై రాష్ట్ర ప్ర‌భుత్వం తీరు బాగోలేద‌ని, ఈ అంశంపై టీఆర్ఎస్ నేతల ఉద్దేశం ఏంటో తెలపాల‌ని కిష‌న్ రెడ్డి అన్నారు.

More Telugu News