: డల్లాస్‌లో పోలీసులను కాల్చి చంపింది జాన్సనే.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఇద్దరు నల్లజాతీయులను అకారణంగా కాల్చి చంపడంపై అమెరికాలో నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. పోలీసుల తీరుపై శుక్రవారం డల్లాస్‌లో నల్లజాతీయులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. రెండు గంటల ప్రదర్శన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కాల్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఐదుగురు పోలీసులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. కాగా ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెక్సాస్‌లోని మెస్క్వైట్‌కు చెందిన మికా జాన్సన్(25) కాల్పులకు తెగబడినట్టు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గతంలో యూఎస్ ఆర్మీలో పనిచేసిన జాన్సన్ నల్ల జాతీయుడు. ఆఫ్గనిస్థాన్‌లోనూ పనిచేశాడు. నల్లజాతి తీవ్రవాద గ్రూపులను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టింగులను పోలీసులు గుర్తించారు. ‘‘నల్లజాతీయులను కాల్చి చంపడంతో తట్టుకోలేకే జాన్సన్ ఈ పనికి పాల్పడ్డాడు. శ్వేతజాతీయులను ముఖ్యంగా పోలీసు అధికారులను చంపాలని అనుకున్నాడు’’ అని జాన్సన్ తల్లి డెల్ఫిన్ బ్రౌన్ మీడియాకు తెలిపారు.