: ఈ అవార్డ్స్ తీసుకుంటున్న వారందరూ ఒకప్పుడు సినీ అవకాశాల కోసం ప్రయత్నించిన వారే: నటి శివపార్వతి
ఇప్పుడు టీవీ అవార్డ్స్ తీసుకుంటున్న వారందరూ కూడా ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన వారేనని ప్రముఖ సినీ, టీవీ నటి శివపార్వతి అన్నారు. టి.సుబ్బరామిరెడ్డి కళాపరిషత్ టీవీ అవార్డ్స్ లో 2015 సంవత్సరానికి గాను బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (మంగమ్మ గారి మనవరాలు సీరియల్)గా ఆమె అవార్డు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ‘ఇప్పుడు టీవీ అవార్డ్స్ తీసుకున్న వారందరూ కూడా సినిమా హీరోయిన్లు, హీరోలు అవుదామని వచ్చిన వాళ్లే. అయితే, వీరిలో హీరో, హీరోయిన్లు అవలేకపోయామనే బాధను పోగొట్టి, ఈరోజు టీవీ మీడియాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లు, పర్ఫామెన్స్ ఉన్న క్యారెక్టర్లను నటీనటులకు ఇచ్చి వాళ్లలో ఉన్న టాలెంట్ ను ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు బయటకు తీసుకువస్తున్నారు. సినిమా కంటే మనమేమీ తక్కువ కాదనే ఆత్మస్థైర్యాన్ని మనందరికీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇస్తున్నారన్నారు. 'నేను నాటక రంగం నుంచి సినీ రంగానికి వచ్చాను. పెద్ద హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లతో కలిసి పనిచేశాను. అయితే, టీవీ మీడియాలో నటించేందుకు నేను వచ్చినప్పుడు కొంచెం బాధ పడ్డాను. కానీ, ఈ రోజున దీనికున్న ఆదరణ, గుర్తింపు ఆ బాధను పోగొట్టి మమ్మల్ని చాలా ఉత్సాహపరుస్తున్నాయి’ అని శివపార్వతి పేర్కొన్నారు.