: రూ. 3 వేలకే 4జీ ఫోన్... గేమ్ స్టార్ట్ అంటున్న రిలయన్స్!


భారత టెలికం రంగంలో దూసుకెళ్లాలని భావిస్తున్న రిలయన్స్ సంస్థ, లైఫ్ బ్రాండ్ 4జీ ఫోన్లను భారీగా తగ్గించి, ప్రత్యర్థి కంపెనీలకు సవాల్ విసిరింది. అత్యాధునిక 4జీ టెక్నాలజీతో పనిచేసే స్మార్ట్ ఫోన్ల ధరలను రూ. 3 వేల కన్నా కిందకు దింపి, ప్రధానంగా ఎయిర్ టెల్ తో 'గేమ్ స్టార్ట్' అంటోంది. 4జీ రంగంలో ఇప్పటికే ఎయిర్ టెల్ మిగతా కంపెనీలతో పోలిస్తే ముందున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎయిర్ టెల్ ను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంతో రిలయన్స్ రిటైల్ సంస్థ గత నెలలో విడుదల చేసిన 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ ఫోన్లు... ఫ్లేమ్ 3, ఫ్లేమ్ 4, ఫ్లేమ్ 5, ఫ్లేమ్ 6లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటి ప్రారంభధర రూ. 4 వేలు కాగా, ఇప్పుడు దాన్ని 25 శాతం మేరకు తగ్గిస్తూ రూ. 2,999కే ఇస్తామని ప్రకటించింది. "రిలయన్స్ రిటైల్ తీసుకున్న నిర్ణయం భారత టెలికం కంపెనీల మధ్య పెను పోటీకి తెరలేపింది" అని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ సీనియర్ అనలిస్ట్ తరుణ్ పాఠక్ అభిప్రాయపడ్డారు. అయితే, తాజా ఫోన్లకు వాయిస్, డేటాతో కూడిన బండిల్డ్ సేవలు లేకపోవడం కొంత మైనస్ కావచ్చని ఆయన అన్నారు. కాగా, ఈ ఫోన్లను కొనుగోలు చేసిన వారు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సిమ్ కార్డును కొనుగోలు చేయాలి. ఆపై వాయిస్, డేటా సేవలను ఖరీదు చేయాల్సి వుంటుంది. ఇక రిలయన్స్ తాజా ఎత్తుగడపై వేచి చూసే ధోరణిలో మిగతా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఉన్నాయి. తొలుత లైఫ్ బ్రాండ్ ఫోన్లకు వచ్చే స్పందన చూడాలని భావిస్తున్నట్టు ఇండియాలో నంబర్ 2, 3 సెల్ ఫోన్ తయారీ సంస్థలుగా ఉన్న మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్ వెల్లడించగా, కార్బన్ మొబైల్స్ మాత్రం తాము ధరలను తగ్గించలేమని స్పష్టం చేసింది. ఇండియాలో గత సంవత్సరం డిసెంబరు నాటికి 4జీ ఫోన్ల సరాసరి ధర రూ. 14,500గా ఉండగా, జూన్ చివరకు అది రూ. 11,500కు పడిపోయిందని నిపుణులు వ్యాఖ్యానించారు. లైఫ్ అమ్మకాలు పెరిగితే సరాసరి ధర మరింతగా తగ్గుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News