: కారు కొనుక్కోవడం కోసం హోటల్లో వెయిటర్ ఉద్యోగంలో చేరిన గవర్నర్ భార్య
అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎలాగో అలా డబ్బు సంపాదించేసి, రాజభోగాలు అనుభవించేద్దాం అనుకునే అధికారుల భార్యలు, వారి కుటుంబ సభ్యులు సమాజంలో కనిపిస్తూనే ఉంటారు. ఉచితంగా వచ్చిన ప్రభుత్వ సౌకర్యాలను విచ్చలవిడిగా ఉపయోగించుకుందాం అని ఆలోచిస్తుంటారు. అవే ఆలోచనలు ఆచరణలో పెడుతుంటారు. కానీ అమెరికాలోని మైనె రాష్ట్ర గవర్నర్ పాల్ లెపేజ్ గారి భార్యకు మాత్రం అలాంటి ఆలోచనలు కిలో మీటరు దూరంలోనే ఉంటాయి. ఎన్నో ఆదర్శభావాలు కలిగి ఆమె ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రాష్ట్రానికి ప్రథమ మహిళ అయితేనేం.. పని చేసి సంపాదించుకున్న డబ్బుతోనే తనకు కావలసినవి కొనుక్కోవాలనుకున్నారు గవర్నర్ పాల్ లెపేజ్ భార్య అన్ లెపేజ్. అందుకే ఇప్పుడు ఓ హోటల్‌లో వెయిటర్ ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఓ కారు కొనుక్కోవాలన్న కోరికతో డబ్బు సంపాదించే పనిలో పడ్డారు అన్ లెపేజ్. తాను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే త్వరలో కారుకొంటానని ఆమె చెప్పారు. అమెరికాలోని మైనె రాష్ట్ర గవర్నర్ పాల్ లెపేజ్ ఆ దేశంలోనే అత్యల్ప జీతం తీసుకుంటారు. అయినా అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాజభోగాలు అనుభవించవచ్చు. అక్రమంగా ప్రభుత్వ కార్లను ఉపయోగించుకోవచ్చు. అయినా గవర్నర్ పాల్ లెపేజ్ భార్య అన్ లెపేజ్ తన భర్త గవర్నర్ బాధ్యతలు నిర్వహించగా వచ్చిన జీతంతోనే తన వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటారట. అయితే, తన భర్తకు వచ్చే జీతంతో కారు కొనే అవకాశం లేకపోవడంతో తానే ఇలా హోటల్‌లో వెయిటర్ ఉద్యోగం చేస్తున్నారు.