: బురఖా లేక ఢాకా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మహిళా ప్రొఫెసర్!... వైరల్ గా మారిన ఫేస్ బుక్ పోస్ట్!
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి పలు ఆసక్తికర కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. బంగ్లాకే చెందిన యువకులు ఈ దాడికి పాల్పడినట్లు ఆ దేశం ఇప్పటికే ప్రకటించింది. ఇస్లామిక్ మత ఛాందసవాదంలో పేట్రేగిపోయిన ముస్లిం యువకులు దాడిలో మానవ మృగాలుగా మారిపోయిన వైనం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. బందీలుగా పట్టుకున్న ఒక్కొక్కరిని పట్టుకుని మిగిలిన వారి ముందే గొంతులు కోసిన ఉగ్రవాదులు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించుకున్నారు. చనిపోయిన 20 మందిలో 18 మంది విదేశీయులు కాగా, ఇద్దరు బంగ్లాకు చెందిన వారు ఉన్నారు. ఈ ఇద్దరిలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ముస్లిం మహిళ ఇష్రాత్ కూడా ఉన్నారు. ఇష్రాత్ చనిపోయిన వైనంపై ఆమె స్నేహితుడు, యూనివర్సిటీ ఆఫ్ కోల్ కతాలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న అలోక్ కుమార్ ఫేస్ బుక్ లో ఓ పోెస్ట్ ను అప్ లోడ్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముస్లిం మహిళ అయినప్పటికీ కేవలం బురఖా ధరించని కారణంగా ఇష్రాత్ చనిపోయిందని తెలిపిన కుమార్... చనిపోయే ముందు ఆమె నరకయాతన అనుభవించిందని పేర్కొన్నారు. బందీల్లో చాలా మంది ముస్లిం మహిళలున్నారు. అయితే వారంతా బురఖాలో ఉన్నారు. బురఖాలో ఉన్న మహిళలతో ఖురాన్ లోని కొన్ని పంక్తులను చెప్పించిన ఉగ్రవాదులు వారిని విడిచిపెట్టారు. అయితే బురఖాలో లేని ఇష్రాత్ ను ఉగ్రవాదులు విదేశీయురాలిగానే భావించారు. ఈ క్రమంలో తాను కూడా బంగ్లాదేశ్ కు చెందిన ముస్లిం మహిళనే అనే విషయాన్ని తెలిపేందుకు ఇష్రాత్ చేసిన యత్నాలు ఫలించలేదు. అసలు తాను ముస్లిం అన్న విషయాన్ని రూఢీ చేసుకునేందుకు ఆమె వద్ద సాక్ష్యాలు లేవని కుమార్ సదరు పోస్ట్ లో పేర్కొన్నారు.