: ఢాకాలో ఉగ్రవాదుల చెరలో భారతీయులు.. దాడి తమ పనేనన్న ఐసిస్


బంగ్లాదేశ్‌లో దాడులకు తెగబడిన ఉగ్రవాదుల చెరలో ఉన్న విదేశీయుల్లో పలువురు భారతీయులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి రాజధాని ఢాకాలోని గుల్షాన్ జిల్లాలో ఓ బేకరీ రెస్టారెంట్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతిచెందగా 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు 60 మంది రెస్టారెంట్‌ సిబ్బంది, కస్టమర్లను బందీలుగా పట్టుకున్నారు. వీరిలో 20 మంది విదేశీయులు కాగా వారిలో పలువురు భారతీయులు కూడా ఉన్నట్టు సమాచారం. బందీలను విడిపించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నాలు ప్రారంభించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సలహాదారు గౌహెర్ రిజ్వి మాట్లాడుతూ ఉగ్రవాదులతో చర్చలు జరిపి బందీలను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. మొత్తం తొమ్మిదిమంది సాయుధులు రెస్టారెంట్‌పై దాడిచేసినట్టు పోలీసు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కొనసాగిన కాల్పులు అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా ఈ దాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ప్రకటించింది. ఉగ్రవాదులు 24 మందిని చంపేసినట్టు పేర్కొంది. అయితే పోలీసులు దీనిని ఖండిస్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు మాత్రమే మరణించారని, 15 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. బందీలుగా ఉన్నవారిలో ఏడుగురు ఇటాలియన్లు, పలువురు భారతీయులు ఉన్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News