: అమిత్ షా 'గబ్బర్ సింగ్' పోస్టర్ పై మండిపడుతున్న బీజేపీ
మహారాష్ట్రలో శివసేన ప్రదర్శించిన పోస్టర్లు కమలనాథులకు మరింత ఆగ్రహం తెప్పించాయి. అంతంత మాత్రంగా ఉన్న శివసేన-బీజేపీ మధ్య సంబంధాలకు ఈ పోస్టర్లు మరింత ఆజ్యం పోశాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను 'గబ్బర్ సింగ్'గా, ఆ పార్టీ అధికార ప్రతినిధి మాధవ్ బండారిని శకుని మామగా చిత్రిస్తూ పోస్టర్లు ప్రదర్శించింది. ఇటువంటి పనులకు పాల్పడటం శివసేనకు తగదని, తన శ్రేణులను అదుపులో పెట్టుకోని పక్షంలో, తామే బుద్ధి చెబుతామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సుజిత్ సింగ ఠాకూర్ హెచ్చరించారు. కాగా, తమపైన, పార్టీపైన శివసేన చేస్తున్న విమర్శలపై బీజేపీ తన అధికార పత్రిక ‘మనోగత్’లో రాసిన వ్యాసంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. శివసేనకు దమ్ముంటే బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి మాధవ్ బండారి సేనకు సవాల్ విసిరారు. ఈ రాతలపై మండిపడ్డ శివసేన ఆయన్ని శకునిమామగా చిత్రిస్తూ పోస్టర్లు చిత్రీకరించింది.