: రద్దీ ప్రాంతాల్లో విచ్చలవిడి కాల్పులకు ప్లానేసిన ఐఎస్ఐఎస్... హైదరాబాద్ శివార్లలో ప్రాక్టీస్
హైదరాబాద్ లోని జనసమ్మర్థ ప్రాంతాల్లో విచ్చలవిడిగా కాల్పులు జరపాలన్న ఆలోచనతో ఉన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు నగర శివారు ప్రాంతాలకు వెళ్లి షూటింగ్ ను ప్రాక్టీస్ చేసినట్టు ఎన్ఐఏ వర్గాలు విచారణలో తెలుసుకున్నాయి. ప్రస్తుతానికి మత విద్వేషాన్ని పెంచేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలపై వీరిని అరెస్ట్ చేసినట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. పూర్తి విచారణ అనంతరం కట్టుదిట్టమైన సెక్షన్లతో కేసులు పెడతామని తెలిపారు. రహస్య ప్రాంతంలో వీరిని తమదైన శైలిలో విచారిస్తూ, వారి నుంచి ఒక్కో విషయాన్నీ బయటకు తీస్తున్నారు. వీరి వద్ద అత్యంత ప్రమాదకర అమోనియం నైట్రేట్ కూడా లభ్యమైందని తెలుస్తోంది. బాంబుల తయారీకి వాడే పలు ఎలక్ట్రిక్ ఉపకరణాలు కూడా లభ్యమైనట్టు పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. వీరిని అరెస్ట్ చేయకుంటే నగరంలో పెను విధ్వంసమే జరిగి ఉండేదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.