: ఆసియా అంతటా 'బేర్'... ఐరోపా ఫ్యూచర్స్ పై పెను ప్రభావం!
బ్రిటన్ రెఫరెండం ప్రభావం ఆసియాలోని అన్ని దేశాల మార్కెట్లనూ కుదేలు చేసింది. ఈయూ నుంచి బ్రిటన్ వెళ్లిపోవాలనే ప్రజలు ఆకాంక్షిస్తున్నారని వెల్లడైన వార్తలు, తొలుత జపాన్ మార్కెట్ ను చావుదెబ్బతీశాయి. నిక్కీ 225 సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే 1,174 పాయింట్లు పడిపోయి 7.8 శాతం నష్టంతో 15,063 పాయింట్లకు చేరింది. ఇటీవలి కాలంలో జపాన్ స్టాక్ మార్కెట్ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ఉదయం 9:45 (భారత కాలమానం ప్రకారం) గంటల సమయంలో కొరియన్ సూచిక స్ట్రెయిట్స్ టైమ్స్ 2.67 శాతం నష్టపోయి 2,712 పాయింట్ల వద్ద, తైవాన్ సూచిక 2.81 శాతం పతనంతో 8,439 పాయింట్ల వద్ద, ఇండొనేషియా మార్కెట్ సూచిక జకార్తా కాంపోజిట్ 2.02 శాతం నష్టంతో 4,777 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. చైనా మార్కెట్ మాత్రం ఈ ఒడిదుడుకులను కొంతమేరకు తట్టుకుంది. షాంగై కాంపోజిట్ సూచిక 1.2 శాతం నష్టంతో సరిపెట్టుకుంది. మిగిలిన ఆసియా సూచికల్లో హాంగ్ సెంగ్ 4.9 శాతం, కోస్పి 4.48 శాతం నష్టపోయాయి. యూరప్ మార్కెట్లో డౌజోన్ శుక్రవారం నాటి ఫ్యూచర్స్ 2.89 శాతం, ఎస్అండ్ పీ 500 ఫ్యూచర్స్ 3.76 శాతం నష్టాన్ని సూచిస్తున్నాయి.