: హిల్లరీ ఓ ప్రపంచ స్థాయి అబద్ధాల కోరు: ట్రంప్ తాజా దాడి


అమెరికా అధ్యక్ష స్థానానికి రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల తరఫున ప్రధాన అభ్యర్థులుగా ముందు వరుసలో ఉన్న డోనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ల మధ్య పోటీ ప్రచారం మరింత వేడెక్కింది. హిల్లరీ క్లింటన్ పై ట్రంప్ తాజాగా మరిన్ని ఆరోపణాస్త్రాలతో విరుచుకుపడ్డారు. హిల్లరీ క్లింటన్ ను ప్రపంచ స్థాయి అబద్ధాల కోరుగా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వ్యక్తిగత లబ్ధికి, దోచుకోవడానికి ఆమె తగిన విధంగా సరిపోతారని విమర్శించారు. విదేశాంగ శాఖను తన సొంత హెడ్జ్ ఫండ్ గా నిర్వహించారని, నగదు పుచ్చుకుని కొందరికి లబ్ధి చేకూర్చారని ఆరోపణలు సంధించారు. ఆమె విదేశాంగ విధానం వల్ల అమెరికా వేలాది మంది ప్రాణాలను కోల్పోయిందని, ట్రిలియన్ల డాలర్లను నష్టపోయిందన్నారు. మన్ హట్టన్ లోని తన ఫైవ్ స్టార్ హోటల్లో బుధవారం మద్దతుదారుల నినాదాల మధ్య ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష స్థానాన్ని ఆశిస్తున్న వ్యక్తుల్లో అత్యంత అవినీతిమయమైన వ్యక్తి హిల్లరీయేనన్నారు. హిల్లరీ నిర్ణయాల ప్రభావంతోనే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ముప్పు తలెత్తిందన్నారు. తన నాలుగేళ్ల పాలనలో మొత్తం మధ్య ప్రాచ్యాన్ని అస్థిరంగా మార్చేశారని ఆరోపించారు. చైనాతో అమెరికా వాణిజ్య లోటు 40 శాతానికి పెరిగింది కూడా హిల్లరీ విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలోనేనన్నారు. క్లింటన్ ఫౌండేషన్ మధ్య ప్రాచ్య దేశాల నుంచి మిలియన్ల డాలర్లను స్వీకరించిందని ఆరోపించారు. హిల్లరీ, ఆమె భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కలసి 2001 నుంచి 15.3 కోట్ల డాలర్లను సంపాదించారన్నారు.

  • Loading...

More Telugu News