: ఎందుకు? ఏమిటి? ఎలా?... అందరూ తెలుసుకోవాల్సిన 'బ్రెగ్జిట్' వివరాలు!


యూరోపియన్ యూనియన్ లో బ్రిటన్ కొనసాగుతుందా? లేదా? అన్న విషయమై నేడు రిఫరెండం జరగనున్న సంగతి తెలిసిందే. బ్రిటన్ వాసుల భవిష్యత్తును తేల్చే 'బ్రెగ్జిట్' (బ్రిటన్, ఎగ్జిట్ అనే రెండు పదాలను కలిపి బ్రెగ్జిట్ అంటున్నారు) పై అందరూ తెలుసుకోవాల్సిన ఆసక్తికర అంశాలివి. ఓటింగ్ కు ఎందుకు?: బ్రిటన్ గత ఎన్నికల సమయంలో ప్రత్యర్థులకు అడ్డుకట్ట వేసేందుకు డేవిడ్ కామెరాన్, ఈయూపై రెఫరెండం కోరతామని హామీ ఇచ్చారు. 28 దేశాల ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగితేనే జాతి ప్రయోజనాలు కాపాడుకోవచ్చని పలువురు ప్రజలు భావిస్తున్న వేళ, ఆయన తన హామీని నిలబెట్టుకున్నారిప్పుడు. ఎవరు ఓటేస్తారు?: బ్రిటన్, ఐరిష్ జాతీయుల్లో 18 సంవత్సరాలు నిండి, యూకేలో ఉన్న వారు, కామన్వెల్త్ దేశాల్లో ఉన్న యూకే పౌరులు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. విదేశాల్లో నివసిస్తూ, ఓటర్లుగా నమోదైన బ్రిటన్, ఐరిష్ జాతీయులూ ఓటేయవచ్చు. స్పెయిన్ దక్షిణ తీరంలోని జిబ్రాల్టర్ పౌరులు, హౌస్ ఆఫ్ లార్డ్ సభ్యులు మొత్తం 4,64,99,537 మంది ఓటు వేసే అవకాశాలున్నాయి. బ్యాలెట్ పేపర్ పై ఏముంటుంది?: యునైటెడ్ కింగ్ డమ్ యూరోపియన్ యూనియన్ లో ఉండాలా? యూరోపియన్ యూనియన్ ను విడిచి పెట్టాలా? అన్న ప్రశ్న మాత్రమే బ్యాలెట్ పేపర్ పై ఉంటుంది. దీనికి సమాధానంగా యూరోపియన్ యూనియన్ లో ఉండాలి, యూరోపియన్ యూనియన్ ను వీడాలి అన్న సమాధానాలు, దాని పక్కనే చిన్న బాక్స్ ఉంటుంది. తమ తమ అభిప్రాయాల మేరకు ఓటర్లు సమాధానాన్ని ఎంచుకోవాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ: పోలింగ్ స్టేషన్లు ఉదయం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటలకు) తెరుస్తారు. రాత్రి 10 గంటల వరకూ (భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి 2:30) ఇవి అందుబాటులో ఉంటాయి. మొత్తం 382 ప్రాంతాల్లో ఓటింగ్ జరగనుండగా, పోలింగ్ పూర్తి కాగానే ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోలింగ్ రోజునా ప్రచారం: బ్రిటన్ చట్టాల మేరకు పోలింగ్ రోజు కూడా ప్రచారం చేసుకోవచ్చు. అయితే, పోలింగ్ ముగిసిన తరువాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ వెలువరించాల్సి వుంటుంది. ఫలితాలు ఎప్పుడు?: రీజనల్ కౌంటింగ్ ఆఫీసులు, ఓట్లను లెక్కించిన తరువాత ఫలితాలను మాంచెస్టర్ కు పంపుతాయి. అక్కడ యూకే ఎలక్షన్ కమిషన్ వాటన్నింటినీ క్రోడీకరించి తుది ఫలితాన్ని శుక్రవారం ఉదయం 7 గంటలకు (భారత కాలమానంలో శుక్రవారం ఉదయం 11:30) వెల్లడిస్తారు. అయితే, మీడియా స్థానిక ఫలితాలను ముందే లెక్కిస్తుంది కాబట్టి తెల్లవారుఝామున 4 గంటలకే (ఇండియాలో శుక్రవారం ఉదయం 9:30) ఫలితాలు తెలిసిపోతాయి. రీకౌంటింగ్ ఉంటుందా?: జాతీయ స్థాయిలో రీకౌంటింగ్ ఉండదు. అయితే, లోకల్ లెవల్ లో రీ కౌంటింగ్ కు అధికారులు ఆదేశాలు జారీ చేయవచ్చు. రిఫరెండమే ఫైనలా?: కానే కాదు. ఇందులో ఫలితం ఎలా ఉన్నా, దానికి పార్లమెంటు తప్పనిసరిగా కట్టుబడివుండాలన్న నిబంధన లేదు. అయితే, మెజారిటీ ఎక్కువగా ఉంటే, కట్టుబడాలని తీవ్ర రాజకీయ ఒత్తిడి ప్రభుత్వంపై ఉంటుంది.

  • Loading...

More Telugu News