: భారత ఆశలపై నీళ్లు... సియోల్ సమావేశంలో ఎన్ఎస్జీ సభ్యత్వ అంశం అజెండాలోనే లేదన్న చైనా


వచ్చే వారంలో సియోల్ లో జరిగే అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ) సమావేశాల అనంతరం ఆ గ్రూపులో చేరిపోవచ్చని భావిస్తున్న ఇండియా ఆశలపై నీళ్లు పడ్డాయి. ఈ సమావేశాల్లో భారత్ కు సభ్యత్వాన్నిచ్చే అంశమేదీ అజెండాలో లేదని చైనా స్పష్టం చేసింది. భారత్ కు సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకించడం లేదని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే అసలు అజెండాలోనే ఈ అంశం లేదని ప్రకటించడం గమనార్హం. కొత్తగా సభ్యత్వాలను అందించే విషయంలో ఎన్ఎస్జీ సభ్య దేశాల్లో విభేదాలు ఉన్నందునే ఈ అంశాన్ని చర్చకు పెట్టలేదని తెలుస్తోంది. తదుపరి దశలో అవసరాన్ని బట్టి దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నదే ఎన్ఎస్జీ ఉద్దేశమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చునీయింగ్ వెల్లడించారు. జూన్ 2న జరిగే సమావేశంలో 48 సభ్య దేశాలు మాత్రమే పాల్గొంటాయని, భారత్ కు ప్రవేశం కల్పించే విషయమై చర్చ జరగబోదని ఆయన తెలిపారు. ఎన్ఎస్జీ గ్రూప్ లోకి రావాలని చాలా దేశాలు యత్నిస్తున్నాయని, ఈ విషయంలో సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News