: జిహాదీలపై పాక్ ప్రేమ.. ‘యూనివర్సిటీ ఆఫ్ జిహాద్’కు 30 కోట్ల కేటాయింపు
జిహాదీలపై తనకెంత ప్రేమ ఉందో పాకిస్థాన్ మరోమారు నిరూపించింది. యూనివర్సిటీ ఆఫ్ జిహాద్ గా పిలిచే ఓ మదర్సాకు ఏకంగా రూ.30 కోట్లు కేటాయించింది. నౌషేరా జిల్లాలోని అకోరా ఖొట్టక్ లో ఉన్న దారుల్ ఉలూమ్ హక్కానియా మదర్సాకు 30 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఖైబర్-పఖ్తుంక్వా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది పాక్ లోనే అత్యంత పురాతనమైనది. 1947లో దీనిని స్థాపించారు. ప్రస్తుతం దీనికి జమియత్ ఉలేమా-ఇ- ఇస్లాం నేత మౌలానా సమీ ఉల్ హక్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు. తాలిబన్ మాజీ చీఫ్ ముల్లా ఒమర్ సహా పలువురు తాలిబన్ లీడర్లు ఈ మదర్సా పూర్వ విద్యార్థులు కావడం గమనార్హం. హక్కానీ నెట్ వర్క్ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్ హక్కానీ, ఆల్ ఖైదా భారత ఉపఖండ నేత అసీం ఉమర్, గత నెలలో అమెరికా డ్రోన్ దాడుల్లో మరణించిన అఫ్గాన్ తాలిబన్ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్ ఈ మదర్సా నుంచి వచ్చినవారే. టాప్ తాలిబన్ నేతలందరూ ఈ మదర్సా పూర్వ విద్యార్థులే కావడంతో దీనికి యూనివర్సిటీ ఆఫ్ జిహాద్ గా పేరొచ్చింది.