: పాకిస్థాన్ కు సాయాన్ని తగ్గించలేం!... తేల్చిచెప్పిన అమెరికా!
ఉగ్రవాద కార్యకలాపాలకు ఆలవాలంగా మారిన పాకిస్థాన్ కు అందజేయనున్న సాయాన్ని తగ్గించాలన్న బిల్లును అమెరికా తోసి పుచ్చింది. ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభ... సాయాన్ని తగ్గించాలంటూ ప్రతిపాదించిన బిల్లును తిరస్కరించింది. ‘డిఫెన్స్ అప్రాప్రియేషన్స్ యాక్ట్-2017’ బిల్లుపై చర్చ సందర్భంగా పాక్ కు ఇవ్వనున్న సాయాన్ని 900 మిలియన్ డాలర్ల నుంచి 700 మిలియన్ డాలర్లకు తగ్గించాలని ఇద్దరు సభ్యులు ప్రవేశపెట్టిన బిల్లును సభ తిరస్కరించింది. ‘కోయలిషన్ సపోర్ట్ ఫండ్’ పేరిట పాక్ కు 900 మిలియన్ డాలర్ల సాయాన్ని అందించాలన్న బిల్లుకు గత నెలలో ఇదే సభ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. అయితే, పాక్ కు సాయాన్ని తగ్గించాలని టెడ్ పోయే, తుల్సీ గబ్బార్డ్ ప్రతిపాదించగా, మరో సభ్యుడు దానా రోహ్రాబచ్చార్... పాక్ కు మొత్తం సాయాన్నే నిలిపేయాలని మరో బిల్లును ప్రతిపాదించారు. ఈ రెండు బిల్లులను కూడా సభ మూజువాణి ఓటుతో తిరస్కరించింది.