: ట్రంప్, హిల్లరీ అమెరికన్లకు నచ్చడం లేదట...లేటెస్ట్ సర్వే!


అమెరికా అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ పడుతున్న డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ ప్రజలకు నచ్చడం లేదని సర్వేలు చెబుతున్నాయి. కాబోయే అధ్యక్ష అభ్యర్థులకు అమెరికన్లలో ఉన్న ఆదరణపై ఏబీసీ న్యూస్-వాషింగ్టన్ పోస్ట్ పత్రికలు నిర్వహించిన సర్వేలో షాకింగ్ ఫలితాలు వెలువడ్డాయి. ప్రతి పదిమంది అమెరికన్లలో ఏడుగురు ట్రంప్ ను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో హిల్లరీ క్లింటన్ కు కూడా పెద్దగా ఆదరణ లభించడం లేదని, గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ ప్రజాదరణ లభిస్తోందని ఈ సర్వే పేర్కొంది. గత నెలతో పోలిస్తే ట్రంప్ పై మరో పది శాతం అధిక వ్యతిరేకత వ్యక్తమైందని ఈ సర్వే తెలిపింది. ట్రంప్ అభ్యర్థిత్వం ప్రకటించిన తరువాత వ్యక్తమైన అతి పెద్ద వ్యతిరేకత ఇదేనని ఈ సర్వే స్పష్టం చేసింది. అదే సమయంలో హిల్లరీ క్లింటన్ కు 43 శాతం ఆదరణ ఉండగా, 55 శాతం వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. 1992 నుంచి చరిత్రను పరికిస్తే అమెరికన్లు చూపిస్తున్న వ్యతిరేకతలో ఇదే ఎక్కువ. అదే సమయంలో అధ్యక్ష అభ్యర్థులిద్దరిపై అమెరికన్లు చూపిస్తున్న అత్యధిక వ్యతిరేకత 1984 తరువాత ఇదే కావడం మరో విశేషమని ఈ సర్వే తెలిపింది.

  • Loading...

More Telugu News