: డ్రైవర్ నిర్వాకంతో తమిళ సినిమా షూటింగ్ ఆగిపోయింది!


కారు డ్రైవర్ మాట దురుసుతనం కారణంగా ఓ సినిమా షూటింగ్ ఆగిపోయిన సంఘటన ఇది. తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న 'రెక్క' సినిమా షూటింగ్ తమిళనాడులోని తిరువయ్యూరులోని పంచనందీశ్వరాలయంలో జరుగుతోంది. సినిమాలో ప్రధానంగా వచ్చే భారీ సన్నివేశాలను తీస్తుండడంతో వాహనాలను కూడా అంతే స్థాయిలో వినియోగిస్తున్నారు. దీంతో స్థానికులు తమ ఇళ్లలోకి వెళ్లలేని విధంగా అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. ఆ సమయంలో ఓ స్థానికుడు తన ఇంటికి అడ్డంగా నిలిపి ఉంచిన వాహానాన్ని తీస్తే ఇంట్లోకి వెళ్తానని అడగడంతో, సినిమా షూటింగ్ కోసం వచ్చిన ఓ వ్యాన్ డ్రైవర్ పెడసరంగా సమాధానం చెప్పాడు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో వ్యాన్ డ్రైవర్ నోటికొచ్చినట్టుగా దుర్భాషలాడాడు. దీంతో స్థానికులు గుమికూడి అతనితో వాగ్వాదానికి దిగారు. స్థానికులు ఎక్కువ మంది రావడం గమనించిన వ్యాన్ డ్రైవర్ మెల్లిగా అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో ఆ సినిమా షూటింగ్ కారణంగా తామంతా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, షూటింగ్ ఆపేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, వ్యాన్ డ్రైవర్ ను అరెస్టు చేస్తామని, షూటింగ్ నిలిపేసేలా చేస్తామంటూ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు.

  • Loading...

More Telugu News