: వైట్ కాలర్ నేరాల్లో పెరుగుతున్న యువతుల పాత్ర
అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, కార్పొరేట్ కంపెనీలను మోసం చేస్తున్న నేరగాళ్లలో యువతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రిస్క్ మేనేజ్ మెంట్, ఆడిట్ సేవలందిస్తున్న కేపీఎంజీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2013తో పోలిస్తే 2015 నాటికి వైట్ కాలర్ నేరాల వెనకున్న ఆడవారి సంఖ్య 7 శాతం పెరిగింది. కార్పొరేట్ కంపెనీల్లో మోసాలకు పాల్పడుతున్న మహిళల్లో 32 శాతం మంది 35 ఏళ్ల లోపువారని, 46 శాతం మంది 36 నుంచి 45 ఏళ్ల లోపువారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా టెక్ మోసాల్లో మహిళల పాత్ర 14 శాతమని, ప్రపంచ స్థాయితో పోలిస్తే, ఇండియాలో ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న అడవారి సంఖ్య అధికమని కేపీఎంజీ పేర్కొంది. కార్పొరేట్ మోసాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారే ఎక్కువ మోసం చేస్తున్నారని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్ క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని నివేదిక తెలిపింది.