: 57 మందిలో 26 మందిని పక్కనబెట్టిన బీసీసీఐ... దిగ్గజ త్రయంతో సలహా కమిటీ
టీమిండియాకు తదుపరి కోచ్ పదవికి మొత్తం 57 మంది దరఖాస్తు చేయగా, వాటిల్లో 26 దరఖాస్తులను ప్రారంభదశలోనే తిరస్కరించిన బీసీసీఐ, మిగిలిన 21 మందితో ఓ జాబితాను తయారు చేసింది. ఈ జాబితా నుంచి కోచ్ ను ఎంపిక చేసే దిశగా దిగ్గజ త్రయం గంగూలీ, సచిన్, లక్ష్మణ్ లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సమన్వయకర్త బాధ్యతలను సంజయ్ జగ్డాలేకు అప్పగించింది. కాగా, ఈ 21 మందికి కమిటీ తొలుత ఇంటర్వ్యూ చేయనుంది. ఆపై తన సిఫార్సులను అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కు అందించనుంది. ఈ నెల 22లోగా కొత్త కోచ్ ఎంపిక పూర్తవుతుందని సమాచారం. కాగా, కోచ్ పదవికి మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే, సందీప్ పాటిల్, వెంకటేశ్ ప్రసాద్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. వీరిలోనూ శాస్త్రి లేదా కుంబ్లేకు పదవి దక్కవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.