: ‘ఉడ్తా పంజాబ్’ అంశంలో నిబంధనలకు అనుగుణంగానే పని చేశా: కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్
‘ఉడ్తా పంజాబ్’ సినిమాపై తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగి చివరకు బాంబే హైకోర్టు ఒకే ఒక్క కట్ తో 'ఏ' సర్టిఫికేట్ తో సినిమా విడుదలకు అనుమతించిన అంశంపై కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్ పహ్లాజ్ నిహలానీ ఈరోజు స్పందించారు. ముంబయిలో మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సినిమా విడుదలపై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. సెన్సార్ నిబంధనల మేరకే తాను ‘ఉడ్తా పంజాబ్’ సినిమా అంశంలో పనిచేశానని చెప్పారు. బాంబే హైకోర్టు సినిమా విడుదలపై ఇచ్చిన తీర్పు ఒకరి ఓటమి, మరొకరి గెలుపును సూచించబోదని పహ్లాజ్ నిహలానీ వ్యాఖ్యానించారు. తమ సినిమాలో పలు సీన్లను తొలగించాలని సూచించిన సెన్సార్ బోర్డు ఆదేశాలు నచ్చకపోతే నిర్మాతలకి కోర్టుకు వెళ్లే హక్కు ఉంటుందని ఆయన చెప్పారు. మరోవైపు సినిమాపై చెలరేగిన వివాదం పట్ల తమకు సినిమా పరిశ్రమ, ప్రజలు, మీడియా నుంచి మంచి మద్దతు లభించడంతో 'ఉడ్తా పంజాబ్' నిర్మాత అనురాగ్ కశ్యప్ హర్షం వ్యక్తం చేశారు. తమకు ఇంతగా మద్దతు వస్తుందని తాము ఊహించలేదని ఆయన చెప్పారు.