: చూశారా... నేనే కరెక్టని రుజువైంది: డొనాల్డ్ ట్రంప్
ఓర్లాండో ఘటనతో ముస్లింలపై తన వైఖరి సరైనదేనని మరోసారి రుజువైందని రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడనున్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇది ఇస్లాం ముష్కరుల పనేనని, కాదని అంగీకరించకుంటే ఒబామా గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఎన్నికైతే, అమెరికాకు వచ్చే ముస్లింలపై నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయని అన్నారు. ఉగ్రవాదులపై, ముస్లింలపై తన దృక్పథం కరెక్టేనని ఈ ఘటన నిరూపించిందని, అమెరికన్లు మరింత తెలివిగా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజాన్ని కూకటివేళ్లతో పెకిలించి తీరాల్సిందేనని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వ్యాఖ్యానించారు. ఘటనపై హిల్లరీ క్లింటన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఆమె అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పుకోవాలని ట్రంప్ డిమాండ్ చేశారు. అమెరికాను పాలిస్తున్న నేతలు బలహీనులని, అందువల్లే దేశ ప్రజలపై దాడులకు ముష్కరులు తెగబడుతున్నారని ఆయన విమర్శించారు. పాలకులు కఠినంగా లేకుంటే, ఓర్లాండోలో జరిగినటువంటి ఘటనలు మరిన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.