: సినీ మా అవార్డ్స్ ఫంక్షన్ లో చిరంజీవి డాన్స్?
టాలీవుడ్ లో ఓ వార్త సినీ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. టాలీవుడ్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ గా అలరిస్తున్న 'మాటీవీ' ప్రతి సంవత్సరం సినీ మా అవార్డ్స్ పేరిట అవార్డులు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా మాటీవీ ఆ అవార్డులను అందజేయనుంది. వివిధ కేటగిరీల్లో అందజేయనున్న ఈ అవార్డుల ఫంక్షన్ షో మధ్యలో పలువురు సెలబ్రిటీలు ఆడి,పాడి అభిమానులను అలరిస్తారు. ఈ సంవత్సరం ఓ ప్రత్యేక అతిధి ఆ ఉత్సవాల్లో సందడి చేయనున్నారు. హైదరాబాదులోని హెచ్‌ఐసీసీలో జరగనున్న సినీ మా అవార్డ్స్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పెర్ఫార్మ్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది న్యూస్ గా చిరంజీవి పెర్ఫార్మెన్స్ నిలవనుంది. సాధారణంగా సినీ ఫంక్షన్లకు చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరవుతుంటారు. అలాంటిది ఈసారి ఆయన పెర్ఫార్మ్ చేయనున్నారన్న వార్త అందర్లోనూ కూతూహలం నింపుతోంది. దీని కోసం గత కొన్ని రోజులుగా చిరంజీవి రిహార్సల్స్ చేస్తున్నారని సమాచారం. ఈ అవార్డు వేడుక ఈ రోజు సాయంత్రం జరగనున్నప్పటికీ, ఈ వేడుకను మాత్రం త్వరలో టెలికాస్ట్ చేయనున్నారు.