: ఇది పిల్లల రెస్టారెంట్... అన్ని పనులూ వాళ్లే చేస్తారు!


ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లామంటే అక్కడ షెఫ్, మేనేజర్, సర్వర్, క్యాషియర్ ఇలా అంతా పెద్దవాళ్లే ఉంటారు. కానీ నెదర్లాండ్స్ రాజధాని ఆమ్ స్టర్ డామ్ లోని 'కిండర్ కుక్ కెఫే రెస్టారెంట్'కు వెళితే మాత్రం... ఓ అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. ఆ రెస్టారెంట్ లో కల్మషం లేని నవ్వులు, అమాయకత్వం కలబోసిన చిన్నారులని వీక్షించవచ్చు. అక్కడ అన్ని పనులూ వీరే చేస్తారు. వారు వండిన వంటలని ఆ చిన్నారులే సెర్వ్ చేస్తారు. కిండర్ కుక్ కెఫే రెస్టారెంట్ వాస్తవానికి హోటల్ కాదు, ఓ కుకింగ్ స్కూల్... తల్లిదండ్రులు విధులకు వెళ్తూ పిల్లలను ఈ 'డే కేర్' సెంటర్ లో వదిలి వెళ్తారు. దీని నిర్వాహకులు ఆ పిల్లలలో ఆసక్తిని కలిగించడం, క్రమశిక్షణ గల వారిగా తీర్చిదిద్దడంలో భాగంగా వారికి వివిధ పనులు నేర్పించి, వారు అందులో రాణించేలా చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగా వారికి వివిధ రకాల వంట పదార్థాలు తయారు చేయడం నేర్పుతారు. తరువాత వాటిని తయారు చేసేందుకు వీరికి అనుమతిస్తారు. అలా పిల్లలే షెఫ్ లుగా మారి పిజ్జాలు, బర్గర్లు, శాండ్ విచ్ లు, మిల్క్ షేక్ లు, బేబీ కుకీస్ వంటివన్నీ తయారు చేస్తారు. వీటిని ఆరగించేందుకు వచ్చేవారికి పిల్లలే మంచి ఆతిథ్యమిస్తారు. వారు ఆరగించిన తరువాత వారి ప్లేట్లను తీసి కడిగేది కూడా ఈ పిల్లలే. రెస్టారెంటును శుభ్రం చేయడం, బిల్లులు రాయడం, క్యాష్ తీసుకోవడం.. ఇలా అన్ని పనులు పిల్లలే చేస్తారు. ఈ రెస్టారెంట్ కు పిల్లల తల్లిదండ్రులే ఎక్కువగా వచ్చినప్పటికీ వీరితో పార్టీ చేసుకునే సదుపాయాన్ని కూడా ఇతరులకు కల్పిస్తున్నారు. ఇక్కడ చేరే కొత్తపిల్లలకు తమకు వచ్చినది నేర్పించడం, సరదాగా గడపడం, బాధ్యతగా వ్యవహరించడం... ఇలాంటి విషయాలన్నీ సీనియర్లు నేర్పుతారు. పిల్లలు బాధ్యతగా వ్యవహరించేలా చేయడమే తమ కిండర్ స్కూల్ ముఖ్యోద్దేశమని నిర్వాహకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News