: 'సౌదీ ఉద్యోగం' అనేది పెద్ద మాఫియా...25 వేల రియాళ్లకు నన్ను అమ్మేశారు: హైదరాబాద్ మహిళా ఉస్నాబేగం
సౌదీ ఉద్యోగాల పేరిట పెద్ద మాఫియా నడుస్తోందని హైదరాబాదుకు చెందిన ఉస్నాబేగం అనే మహిళ ఆరోపించారు. సౌదీ అరేబియా నుంచి హైదరాబాదు చేరుకున్న ఆమె మాట్లాడుతూ, ఇంట్లో పని ఇప్పిస్తామని, మంచి జీవితం లభిస్తుందని ఏజెంట్లు దొంగమాటలు చెప్పి తీసుకెళ్లారని అన్నారు. అక్కడికి వెళ్లిన తరువాత ఒక షేక్ కు 25 వేల రియాల్ లకు తనను అమ్మేసినట్టు తెలిసిందని ఆమె చెప్పారు. సౌదీ అరేబియా చేరిన తరువాత ఈ విషయం తెలియడంతో ఏం చేయాలో తనకు తెలియలేదని ఆమె అన్నారు. షేక్ తనను వ్యభిచారం చేయమని డిమాండ్ చేశాడని ఆమె వెల్లడించారు. తప్పు చేయడం చావుతో సమానమని భావించిన తాను అందుకు అంగీకరించ లేదని, దీంతో తనను ఓ గదిలో వేసి తాళం వేశారని, చిత్రహింసలకు గురి చేశారని ఆమె తెలిపారు. ఓ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుని అతని బారి నుంచి తప్పించుకుని భారత ఎంబసీకి చేరానని, అక్కడి అధికారులు తనను హైదరాబాదు పంపారని ఆమె తెలిపారు. ఇలా 'ఇంట్లో పనుల' ముసుగులో వెళ్లిన చాలా మంది వ్యభిచారం రొంపిలో మునిగిపోయారని ఆమె పేర్కొన్నారు. సౌదీలో ఉద్యోగాల పేరిట పెద్ద మాఫియా నడుస్తోందని ఆమె ఆరోపించారు. ఉద్యోగం ఆశతో సౌదీ అరేబియా వెళ్తున్న చాలా మంది తమ ప్రమేయం లేకుండా, తమని తాము అమ్ముకుంటున్నారని ఆమె తెలిపారు.