: నిద్రపోతున్న ఉద్యోగి పక్కనే కూర్చుని ఫొటో దిగిన బాస్!
ఒక ఉద్యోగి నిద్రపోతుండగా అతని పక్కనే కూర్చుని ఎంచక్కా ఫొటో దిగిన బాస్ కథ ఇది. ఆశ్చర్యం కల్గించే ఈ వింత సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ప్రఖ్యాత వ్యాపార వేత్త, వర్జిన్ గ్రూపు వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ ఆస్ట్రేలియాలోని తన కార్యాలయానికి వెళ్లాడు. అక్కడి సోఫాలో పక్కకు తిరిగి చక్కగా పడుకుని నిద్రపోతున్న ఒక ఉద్యోగిని చూశాడు. ఇక్కడే, ఆయన తన దైనశైలిలో వ్యవహరించాడు. సహజంగా హాస్య ప్రియుడైన రిచర్డ్ బ్రాన్సన్, ఆ ఉద్యోగిని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు. పైగా, ఆ ఉద్యోగి తలపక్కనే తన చేతిని పెట్టి, ఒక మోకాలు కిందపెట్టి నవ్వుతూ ఒక ఫొటో కూడా దిగాడు. ఈ ఫొటోను వర్జిన్.కామ్ లో పోస్ట్ చేయడమే కాకుండా ఒక వ్యాఖ్య కూడా చేశాడు. ‘వావ్, అతన్ని నిద్ర లేపినట్లయితే షాకయ్యేవాడు. తన కలల్లో తేలిపోయి ఉంటాడు. ఎందుకంటే, ఎంచక్కా నిద్ర పోతున్నాడు కాబట్టి’ అంటూ రిచర్డ్ బ్రాన్సన్ వ్యాఖ్యానించాడు. అంతేకాదు, అతనికి నిద్ర అవసరమైంది కనుకే నిద్రపోయాడంటూ ఆ హ్యుమరస్ బాస్ అన్నాడు. అయితే, నిద్రపోతూ దొరికిపోయిన సదరు ఉద్యోగి ఫీలయ్యాడో లేదో కానీ, ఆ అరుదైన ఫొటోను మాత్రం ఎప్పటికీ మరిచిపోలేడు.