: రేపు తెలంగాణ రాష్ట్రానికి అమిత్ షా రాక.. నల్గొండలో రేపటి బహిరంగ సభకు చక చకా ఏర్పాట్లు
తెలంగాణలో నిర్వహించే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. దీని కోసం రేపటి నుంచే కసరత్తు మొదలు పెట్టనున్నట్లు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు నల్గొండ జిల్లా సూర్యాపేటలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో సభ నిర్వహించనున్న అక్కడి ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహణకు ఆ పార్టీ నేతలు చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
రేపు సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానున్నట్లు సమాచారం. సభ ప్రారంభం ముందు బీజేపీ నేతలు సూర్యాపేటలో ర్యాలీలు నిర్వహిస్తారు. అనంతరం ర్యాలీగానే కార్యకర్తలందరూ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. బహిరంగ సభలో అమిత్ షా తో పాటు తెలంగాణ బీజేపీ నేతలు ప్రసంగం చేయనున్నారు. కేంద్రం రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలుపుతూ తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా బీజేపీ నేతలు ప్రసంగించనున్నారు.