: కోదండరాం మీ ముందుంచిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి: మంత్రిని నిలదీసిన విద్యార్థి సంఘం
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సంక్షేమ పథకాలు, పాలనపై టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోదండరాం వ్యాఖ్యలను తిప్పికొడుతూ తెలంగాణ మంత్రులు ఆయనపై వ్యక్తిగత దూషణలకు దిగారు. మేధావి కోదండరాంపై టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతిపక్షాలే కాకుండా పలు ప్రజా సంఘాలు కూడా ఖండిస్తున్నాయి. దాని ప్రభావం మహబూబ్ నగర్‌లోనూ కనిపించింది. జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు కాన్వాయ్‌ను విద్యార్థి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. కోదండరాంపై దూషణలు మానుకోవాలని మంత్రికి వారు సూచించారు. కోదండరాంపై విమర్శలు సరికావని నిరసన వ్యక్తం చేశారు. కోదండరాం ప్రభుత్వ పాలనపై మంత్రుల ముందు కొన్ని ప్రశ్నలు ఉంచారని, ముందు వాటికి జవాబు చెప్పాలని జూపల్లిని విద్యార్థి నేతలు నిలదీశారు.