: వీణా-వాణీలను విడదీయలేం!... చేతులెత్తేసిన ఎయిమ్స్!
శరీరాలు రెండు... తలలు కూడా రెండే. అయితే రెండు తలలు అతుక్కుపోయిన స్థితిలో జన్మించిన వీణా-వాణీలను విడదీసేందుకు జరుగుతున్న యత్నాల్లో ప్రతిష్టంభన నెలకొంది. అవిభక్త కవలలుగా జన్మించిన ఈ చిన్నారులను విడదీసి వారికి కొత్త జీవితం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వీణా- వాణీలను విడదీసేందుకు ఎంత మేర ఖర్చు అయినా వెనుకాడేది లేదని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 13 ఏళ్లుగా హైదరాబాదులోని నీలోఫర్ ఆసుపత్రిలోనే ఉంటున్న వీరిని విడదీసే బాధ్యతను ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) తీసుకుంది.
అన్ని రకాల పరీక్షలు చేసిన ఎయిమ్స్ వైద్యులు... వీణా-వాణీలను విడదీయడం సాధ్యం కాదని తేల్చేశారు. ఆపరేషన్ చేసి ఆ చిన్నారులను విడదీస్తే... వారికి ప్రాణహాని ఉందని తెలిపారు. ఒకవేళ ప్రాణహాని తప్పినా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. దీంతో వీణా-వాణీలను విడదీసేందుకు చేపట్టిన చర్యలు దాదాపుగా నిలిచిపోయాయి. విదేశాలకు పంపి వీరిని విడదీసే అవకాశాలున్నాయా? అన్న కోణంలో పరిశీలన చేయడం మినహా మరో మార్గం లేదన్న వాదన వినిపిస్తోంది.