: విద్యార్థుల కష్టాలను పోగొట్టేందుకు రంగంలోకి దిగిన ‘గద్ద’!
స్కాట్లాండ్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థుల కష్టాలను పోగొట్టేందుకు గద్దను రంగంలోకి దింపారు. ముల్లును ముల్లుతోనే తీయాలనే నానుడిని బాగా ఒంట పట్టించుకున్నారో ఏమో..! పాఠశాలలో రోజు రోజుకీ పెరిగిపోతున్న పక్షులను అక్కడి నుంచి తరిమేసేందుకు అక్కడి పెర్త్ గ్రామర్ పాఠశాలలో ఓ గద్దను నియమించుకున్నారు. దీంతో పక్షులను అక్కడి నుంచి తరిమేయొచ్చని భావించారు. వివరాల్లోకి వెళితే, విద్యార్థులు గ్రౌండ్‌లో ఆడుకునే సమయాల్లోను, భోజనం చేసేటప్పుడు అధిక సంఖ్యలో పక్షులు వారి చుట్టూ తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయట. విద్యార్థులను తాకుతూ, వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలను నోట్లో కరుచుకుని పోతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయట. పక్షులను చెదరగొట్టేందుకు, స్కూల్ పరిసరాల నుంచి వాటిని తరిమేందుకు స్కూల్ యాజమాన్యం ఎన్ని చర్యలు తీసుకున్నా విఫలమైపోయాయట. దీంతో స్కూల్ యాజమాన్యానికి గద్దను రంగంలోకి దింపాలనే ఉపాయం తట్టింది. గద్దను నియమించడం కోసం స్కూల్ యాజమాన్యానికి 7లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. ఇప్పుడు వారి ఉపాయం మంచి ఫలితాన్నిచ్చింది. ‘స్పినీ’ అనే ఈ గద్దను రంగంలోకి దించడంతో స్కూల్ పరిసరాల్లోనుంచి పక్షులు దూరమైపోయాయి.