: భర్తతో కలిసి పని చేయకపోవడమే మంచిదని చెబుతున్న విద్యాబాలన్
తన భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ తో కలిసి పనిచేయకపోవడమే మేలని బాలీవుడ్ నటి విద్యాబాలన్ అభిప్రాయపడింది. ముంబైలో 'తీన్' ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వ్యక్తిగత జీవితానికి, వృత్తికి మధ్య సంబంధం ఉండకూడదని తెలిపింది. తన భర్తతో కలసి పని చేస్తే చాలా సౌకర్యంగా ఉంటుందని తనకు తెలుసని పేర్కొంది. అయితే వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని కలపకూడదన్నది తన సిద్ధాంతమని చెప్పింది. అలా రెంటిని కలపకపోవడమే తమ వైవాహిక జీవితానికి మంచిదని పేర్కొంది. ఎందుకంటే, కొన్నిసార్లు మంచి సినిమాలు కూడా బాగా ఆడకపోవచ్చని తెలిపింది. అలాంటి సందర్భం ఎదురైతే ఇబ్బంది కలిగిస్తుందని పేర్కొంది. అదీ కాక తామిద్దరం వృత్తి గురించి పెద్దగా చర్చించుకోమని తెలిపింది. అందుకే తామిద్దరం కలిసి పనిచేయకపోవడమే ఉత్తమమని అభిప్రాయపడింది. అదే సమయంలో తన మరిది కునాల్ రాయ్ కపూర్ దర్శకత్వంలో చిన్న పాత్ర అయినా సరే చేయాలని ఉందని చెప్పింది.