: ఒలింపిక్స్ చాన్స్ నర్సింగ్ యాదవ్ కే... సుశీల్ పిటిషన్ ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
రియో ఒలింపిక్స్ లో భారత్ తరఫున రెజ్లింగ్ లో పోటీ పడే చాన్స్ నర్సింగ్ యాదవ్ కు దక్కింది. ఒలింపిక్స్ కు ఎవరు వెళ్లాలన్న విషయమై ట్రయల్స్ నిర్వహించాలని మరో రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, దాన్ని కొట్టివేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం తీర్పిచ్చింది. అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనల ప్రకారం, ఒలింపిక్స్ కు వెళ్లేందుకు నర్సింగ్ యాదవ్ అర్హుడని, ట్రయల్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా, ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో నర్సింగ్ కాంస్య పతకం గెలవడం ద్వారా, ఒలింపిక్స్ బెర్తును ఖరారు చేసుకోగా, గాయాల కారణంగా ఆ పోటీల్లో పాల్గొనలేకపోయిన సుశీల్, తనకు ఒలింపిక్ చాన్స్ కావాలని, నర్సింగ్ కు, తనకు మధ్య పోటీ పెట్టి ఎవరు గెలిస్తే, వారిని పంపాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.