: 96 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా సాధించిన తాతయ్య.. గిన్నిస్ రికార్డ్ నమోదు
చదువు కొనసాగించడానికి మీద పడిన వయసు అడ్డుకాదని జపాన్‌కు చెందిన ఓ తాతయ్య నిరూపించారు. 85 ఏళ్ల వయసులో డిగ్రీ కోర్సును ప్రారంభించి 11 ఏళ్ల తరువాత తాజాగా ఆ డిగ్రీని పూర్తి చేసి పట్టా అందుకున్నారు షిగేమి హిరాటా అనే తాతయ్య. ఇప్పుడు ఆయన వయసు 96ఏళ్లు. క్యోటో యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ నుంచి ఇటీవల డిగ్రీ పట్టాను అందుకున్న ఈ తాతయ్య గిన్నీస్ బుక్‌లోకి ఎక్కేశారు. 96 ఏళ్ల వయసులో డిగ్రీని పూర్తి చేసిన వ్యక్తి ప్రపంచంలో మరెవరూ లేరంటూ ఆయనకు గిన్నిస్ బుక్ పర్యవేక్షకులు సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఈ తాతయ్య యువకుడిగా ఉన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ నేవీలో పనిచేశారు. 11ఏళ్ల క్రితం 85 ఏళ్ల వయసులో తాను సెరామిక్ ఆర్ట్‌లో డిగ్రీ చేయాలని నిర్ణయించుకున్నానని, కాలేజీకి వెళ్లి తిరిగి చదువుకోవడం ప్రారంభించానని షిగేమి హిరాటా చెప్పారు. తాను కాలేజీ గేటులోపలికి ఎంట్రీ ఇవ్వగానే అక్కడి విద్యార్థులు తనను ఓ సెలబ్రిటీని చూసినట్లు చూసేవారని ఈ తాతయ్య మురిసిపోతూ చెప్పారు. అత్యధిక వయసులో గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు ఎక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.