: ఆఖరి గంట వ్యవధిలో రూ. 44 వేల కోట్లు లాభపడ్డ సెన్సెక్స్!


సెషన్ ఆరంభం నుంచి క్రితం ముగింపుతో పోలిస్తే ఒడిదుడుకుల మధ్య అత్యధిక సమయం నష్టాల్లోనే సాగిన భారత స్టాక్ మార్కెట్ సూచికలు, చివరి గంట వ్యవధిలో దూసుకెళ్లాయి. మధ్యాహ్నం 2:20 గంటల సమయంలో 26,720 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్, 3:10 గంటలకు 26,864 పాయింట్లకు పెరుగగా, లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 44 వేల కోట్లకు పైగా పెరిగింది. మిడ్ క్యాప్ సెక్టార్ ఇతర సూచికల కంటే మెరుగైన లాభాలను నమోదు చేసింది. నిఫ్టీ సూచిక కీలకమైన 8,200 పాయింట్ల స్థాయిని అధిగమించింది. గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 129.21 పాయింట్లు పెరిగి 0.48 శాతం లాభంతో 26,843.14 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 39 పాయింట్లు పెరిగి 0.48 శాతం లాభంతో 8,218.95 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.66 శాతం, స్మాల్ కాప్ 0.29 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 33 కంపెనీలు లాభపడ్డాయి. యస్ బ్యాంక్, కోల్ ఇండియా, హిందాల్కో, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, విప్రో, హెచ్సీఎల్ టెక్, ఇన్ ఫ్రాటెల్, సన్ ఫార్మా, లుపిన్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,786 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,259 కంపెనీలు లాభాలను, 1,361 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బుధవారం నాడు రూ. 99,52,435 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 99,96,406 కోట్లకు పెరిగింది.

  • Loading...

More Telugu News