: ఏడాదిలోనే రూ.30 వేల కోట్ల నుంచి సున్నాకి పడిపోయిన ఆమె ఆస్తి!


ఎలిజబెత్‌ హోమ్స్‌... నిన్నటివరకు అమెరికాలో ఆమె మహా ధనవంతురాలిగా పేరు తెచ్చుకుంది. గత ఏడాదిలో ఫోర్బ్స్ పత్రికలో ఈమె పేరు మారుమోగిపోయింది. ఫోర్బ్స్ ఏటా ప్రచురించే స్వయం సంపాదనా పెట్టుబడితో అభివృద్ధి సాధించిన యువ ధనవంతుల జాబితాలో ముందు వరుసలో నిలిచిన ఎలిజబెత్‌ హోమ్స్‌, ఎంత త్వరగా పేదరికాన్ని జయించి యువ బిలీయనీర్ల జాబితాలో చేరిపోయారో అంతే వేగంగా మళ్లీ కడుపేదరాలిగా మిగిలిపోయారు. 19 సంవత్సరాలకే చదువుకు పుల్‌స్టాప్ పెట్టి 2003లో స్టాన్‌ ఫోర్డ్‌ యూనివర్శిటీ నుంచి బయటకు వచ్చిన ఎలిజబెత్‌ హోమ్స్‌, వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చే ప్రయత్నాల్లో భాగంగా రక్త పరీక్ష విధానాన్ని అభివృద్ధి పరిచారు. నరాల వ్యవస్థ దెబ్బతినకుండా, రోగికి నొప్పి అన్నది లేకుండా కేవలం ఒక్క బొట్టు రక్తంతోనే రక్త పరీక్షను నిర్వహించే వ్యవస్థను అభివృద్ధి పరచి, థీరనోస్ పేరుతో ఒక కంపెనీ స్థాపించారు. ఫోర్బ్స్ కు అందిన సమాచారం ప్రకారం గత ఏడాదిలో ఎలిజబెత్‌ హోమ్స్‌ కు కంపెనీలో ఉన్న వాటా విలువ 4.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.30వేల కోట్లకు) పెరిగింది. ఈ డేటా ఆధారంగానే 32 ఏళ్ల హోమ్స్‌ అత్యంత సంపన్నురాలు అని ప్రచురించిన ఫోర్బ్స్, ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఈమె సంపదను ఒక్కసారిగా సున్నాకు తగ్గించింది. ఎలిజబెత్‌ హోమ్స్‌ కంపెనీ ద్వారా జరుగుతున్న రక్త పరీక్షలో నాణ్యత లేదని ఆ తరువాత కాలంలో వెల్లడయ్యింది. యూ.ఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మొదలుకుని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కూడా ఇదే విషయాన్ని ప్రచురించడంతో కంపెనీ విలువ ఒక్కసారిగా తగ్గిపోయింది. దీనికి తోడు కంపెనీ లెక్కల్లో కూడా అవకతవకలు జరిగాయని తేలింది. కంపెనీలో ప్రైవేటు పెట్టుబడిదారుల మొత్తం 9 బిలియన్లు (సుమారు రూ.60వేల కోట్లు)గా ఉన్నట్లు పుస్తకాల్లో ఉండగా, వాస్తవ విలువ మాత్రం 800 మిలియన్లు (సుమారు రూ.5,300 కోట్లు)ని తేలింది.

  • Loading...

More Telugu News