: చాంపియన్స్ ట్రోఫీ డ్రాలో అవకతవకలు... క్రికెట్ మజా కోసమే అంటున్న ఐసీసీ చీఫ్
నిన్న విడుదలైన చాంపియన్స్ ట్రోఫీ డ్రాలో అవకతవకలు జరిగాయన్న విమర్శలపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవ్ రిచర్డ్ సన్ వివరణ ఇచ్చారు. క్రికెట్ కు ఉన్న ప్రాధాన్యత, అభిమానుల అంచనాలు, ఆటలోని మజా కోసం తాము అప్పుడప్పుడూ డ్రాలో మార్పులు చేయడం సహజమేనని అన్నారు. వాస్తవానికి ఐసీసీ టాప్-8 జట్ల మధ్య చాంపియన్స్ ట్రోఫీకి పోటీలు జరుగుతుండగా, ఇండియా, పాకిస్థాన్ జట్లు ర్యాంకుల ప్రకారం చూస్తే, రెండు వేర్వేరు గ్రూపుల్లో తలపడాల్సి వుంది. కానీ రెండింటినీ ఒకే గ్రూపులో ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై వివరణ ఇచ్చిన డేవ్, పెద్ద పెద్ద ఈవెంట్లలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ కి ఎంతో పాప్యులారిటీ ఉంటుందని గుర్తు చేశారు. ప్రతి టోర్నీలో ఈ రెండు దేశాల మధ్యా ఓ మ్యాచ్ ఉండేలా తాము ఎప్పుడూ ప్రయత్నిస్తుంటామని, భారత్, పాక్ మ్యాచ్ తో వచ్చే కిక్కే వేరని అన్నారు. ఒక్కోసారి మ్యాచ్ చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది టీవీలకు అతుక్కుపోయిన సందర్భాలు ఉన్నాయి. భారీ స్థాయిలో ఆదాయం కూడా వస్తుందన్న సంగతి తెలిసిందే.