: వరల్డ్ నో-టొబాకో డే: పొగాకుతో ప్రతీ గంటకీ 150 మంది మృతి.. డబ్యూహెచ్‌వో హెచ్చరిక
పొగాకు వ్యసన బారినపడి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటోన్న వ్యక్తుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా నో-టొబాకో డే ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్‌వో) ఆందోళన కలిగించే పలు నిజాలను తెలియజేసింది. భారత్‌తో పాటు సౌత్ ఈస్ట్ ఏసియా ప్రాంతంలో ప్రతీ సంవత్సరం 1.3 మిలియన్ల ప్రజలు పొగాకు కారణంగా మృత్యువాత పడుతున్నారని చెప్పింది. ప్రతీ గంటకు 150 మంది ప్రజలు పొగాకు కలిగించే వ్యాధులతో చనిపోతున్నారని డబ్యూహెచ్‌వో పేర్కొంది. పొగాకు బారిన పడకుండా ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. పొగాకు ప్రాణాంతకం అనే సత్యాన్ని తెలియజేస్తూ ఈరోజు భారత్ సహా ప్రపంచ దేశాలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. పొగాకును వాడుతూ క్యాన్సర్, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధుల్ని కొని తెచ్చుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజా ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రభుత్వాలు పొగాకు అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని డబ్యూహెచ్‌వో అధికారులు సూచిస్తున్నారు.