: అమ్మకాల ఒత్తిడి కనిపించినా, కొనసాగిన మార్కెట్ లాభం
సెషన్ ఆరంభమైన నిమిషాల వ్యవధిలో క్రితం ముగింపుతో పోలిస్తే 150 పాయింట్లకు పైగా లాభంలోకి సెన్సెక్స్ దూసుకెళ్లిన వేళ, అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో, ఒడిదుడుకులకు గురైన బెంచ్ మార్క్ సూచికలు, చివరకు లాభాలను కొనసాగించడంలో మాత్రం విజయం సాధించాయి. ఆసియా మార్కెట్లలో లాభాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను నిలిపి ఉంచాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 72 పాయింట్లు పెరిగి 0.27 శాతం లాభంతో 26,725.60 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 21.85 పాయింట్లు పెరిగి 0.27 శాతం లాభంతో 8,178.50 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.35 శాతం, స్మాల్ కాప్ 0.42 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 24 కంపెనీలు లాభపడ్డాయి. హిందాల్కో, టాటా మోటార్స్, టాటా పవర్, కోల్ ఇండియా, తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, బీహెచ్ఈఎల్, టాటా స్టీల్, జడ్ఈఈఎల్, మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,801 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,238 కంపెనీలు లాభాలను, 1,372 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 99,57,641 కోట్లకు పెరిగింది.