: ఇండియాలో మరింతగా తగ్గనున్న వడ్డీ రేట్లు: మోర్గాన్ స్టాన్లీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఇండియాలో మరో అర శాతం వరకూ వడ్డీ రేట్లు తగ్గవచ్చని రీసెర్చ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. వచ్చే నెల 7వ తేదీన జరగనున్న ఆర్బీఐ పరపతి విధానంలో మాత్రం కీలక రేట్ల సవరణ ఉండకపోవచ్చని ఓ నివేదిక విడుదల చేసింది. మార్చి 2017లోగా ద్రవ్యోల్బణం 4.5 శాతానికి దిగివస్తుందని, వినియోగ ధరల సూచి ఆధారిత ఆర్బీఐ వాస్తవ లక్ష్య అంచనా 1.5 నుంచి 2 శాతం వరకూ ఉండవచ్చని పేర్కొంది. మరో 50 బేసిస్ పాయింట్ల వరకూ రెపో రేటు తగ్గవచ్చని భావిస్తున్నట్టు తెలిపింది. టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం గడచిన ఏప్రిల్ నెలలో 5.39 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. పెరిగిన ఆహార ఉత్పత్తుల ధరలే ఇందుకు కారణం. తదుపరి రుతుపవనాలపై ఆధారపడి రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలు తీసుకోనుందని, ఈ సీజనులో అంచనాలకు తగ్గట్టు వర్షాలు పడితే, కీలక రేట్లు తగ్గించే వెసులుబాటు దగ్గరవుతుందని ఈ రిపోర్టు అంచనా వేసింది. వర్షాలు బాగుంటే ఆగస్టులో లేదా అక్టోబరులో వడ్డీ రేట్లు తగ్గవచ్చని వెల్లడించింది. కాగా, ఏప్రిల్ లో రెపో రేటును ఆర్బీఐ పావు శాతం మేరకు తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో జనవరి 2015 నుంచి ఇప్పటి వరకూ ఒకటిన్నర శాతం మేరకు వడ్డీ రేట్లు తగ్గగా, ఆ మేరకు ప్రయోజనాలు మాత్రం ప్రజలకు దగ్గర కాలేదు. తమ మార్జిన్లు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో, ఆర్బీఐ నిర్ణయాలను అమలు చేయడంలో బ్యాంకులు అలసత్వాన్ని ప్రదర్శిస్తుండటమే ఇందుకు కారణం.