: మా నాన్నకు యాభై ఏళ్ల వయస్సులో నేను పుట్టాను: కమలహాసన్
‘మా నాన్న యాభై ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు నేను పుట్టాను’ అని ప్రముఖ నటుడు కమల్ హాసన్ అన్నారు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ, ‘మా అమ్మ గారు క్రానిక్ డయాబెటిక్. నా తల్లిదండ్రులకు లాస్ట్, అన్ ఎక్స్ పెక్టెడ్ చైల్డ్ నేను. మా ఫాదర్ కు దాదాపు యాభై సంవత్సరాలున్నప్పుడు నేను పుట్టాను. ఒక బొమ్మలా ఉండేవాడినట. మధ్యాహ్నం సమయంలో మా అమ్మకు నిద్ర లేకుండా చేస్తుండేవాడిని. అందుకని, మా ఫ్యామిలీ డాక్టర్ సారా రామచంద్రన్ కు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లమని ఒకసారి మా అమ్మ చెప్పింది. దాంతో ‘ఏవీఎం’ స్టూడియోలో లంచ్ కు మా ఫ్యామిలీ డాక్టర్ నన్ను తీసుకువెళ్లారు. అక్కడ నేను చేస్తున్న పనులన్నింటినీ ఏవీఎం అధినేత మెయ్యప్పన్ గారి కుమారుడు శరవణన్ గారు చూశారు. తన తండ్రి వద్దకు నన్ను తీసుకువెళ్లారు. అప్పుడు, మెయ్యప్పన్ గారు... ‘ఏమొస్తుంది?’ అని ప్రశ్నించారు. ‘ఏదైనా వస్తుంది’ అని నేను సమాధానం చెప్పాను. ఎలాగైనా యాక్టు చేసి చూపించమని ఆయన అన్నారు. ‘మీలాగ యాక్టు చేసి చూపిస్తాను’ అని నేను చెప్పాను. ‘పిక్చర్ లో నటిస్తావా, నటిస్తే ఎంత డబ్బులు తీసుకుంటావు?’ అని మెయ్యప్పన్ గారు నన్ను ప్రశ్నించారు. ఒక్క ప్లైమూత్ కారు, రెండు ఆల్సేషన్ పప్పీలు కావాలని నేను సమాధానం చెప్పాను’ అని కమల్ హాసన్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.